ఆత్మవిశ్వాసం.. పిల్లలకు తల్లిదండ్రులు అందించాల్సిన అసలైన ఆస్తి. కాన్ఫిడెంట్గా ఉంటేనే.. వారి భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొనే ‘శక్తి’ లభిస్తుంది.
ఆత్మవిశ్వాసం.. పిల్లలకు తల్లిదండ్రులు అందించాల్సిన అసలైన ఆస్తి. కాన్ఫిడెంట్గా ఉంటేనే.. వారి భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొనే ‘శక్తి’ లభిస్తుంది. అయితే.. ఇది రాత్రికి రాత్రే వచ్చేదికాదనీ, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే వారిపై వారికి నమ్మకాన్ని కలిగించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వారిపై మీరు చూపించే ప్రేమ, విశ్వాసం, ఇంట్లో వారినిఎలా చూసుకుంటున్నారు? అనే విషయాలే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనీ అంటున్నారు.
చిన్నచిన్న విషయాల్లో.. నిర్ణయాలను పిల్లలకే వదిలేయండి. బయటికి వెళ్లేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో.. సాయంత్రం స్నాక్స్ కోసం ఏం సిద్ధం చేయాలో.. వారినే నిర్ణయించుకోమని చెప్పండి. వారి నిర్ణయాలను గౌరవించండి. ఈ చిన్న అలవాటే.. పిల్లల్లో సొంతంగా ఆలోచించుకొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో పెద్దపెద్ద నిర్ణయాలు సులువుగా తీసుకోగలిగే విశ్వాసాన్ని అందిస్తుంది.
చదువుల్లోనైనా, ఆటల్లోనైనా ఫలితం ఎలా ఉన్నా.. పిల్లల ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. వారు ఎంత శ్రమిస్తున్నారనేదే ముఖ్యమని గ్రహించండి. చదువుల్లో గ్రేడ్లు తెచ్చుకోవడం.. ఆటల్లో కప్పులు కొట్టేయడం మాత్రమే ‘విజయం సాధించినట్టు’ కాదన్న విషయం వారికి బాల్యం నుంచే నేర్పించండి. ఓడిపోయినప్పుడు కూడా వారి వెన్ను తట్టండి. ఇలాంటి ప్రోత్సాహం.. పిల్లల్లో సానుకూల మనస్తత్వాన్ని పెంచుతుంది. ఎలా గెలవాలో.. సమస్యలు ఎదురైతే ఎలా పోరాడాలో వారికి నేర్పుతుంది. ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండలేమనే విషయాన్ని కూడా పిల్లలకు బోధపరుస్తుంది.
పిల్లలు స్కూల్నుంచి వచ్చినప్పడో.. మీరు ఆఫీస్నుంచి ఇంటికి వెళ్లినప్పుడో.. మీ చిన్నారులను దగ్గరికి తీసుకొని కౌగిలించుకోండి. దీనివల్ల వారు భావోద్వేగానికి లోనవుతారు. వారిలో ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. వారి మానసిక స్థితిని మెరుగుపర్చడంలో ఇది సాయపడుతుంది. దాంతో పిల్లలు మానసికంగా మరింత బలంగా తయారవుతారు. రోజూ ఇలా చేయడం వల్ల పిల్లల్లో జీవితం పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఏ సందర్భంలోనైనా కుటుంబం తనకు అండగా ఉంటుందనే భరోసా కలుగుతుంది. ఇంట్లో సురక్షితంగా ఉన్నామని భావించే పిల్లలు.. మరింత ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు.
ఒక చిన్న అభినందన.. వారికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చిన్న విజయమైనా.. మీ ప్రశంస పెద్దగా ఉండాలి. అప్పుడే.. వారిలో పదేపదే ప్రశంసలు పొందాలనే భావన కలుగుతుంది. మీ అభినందనలే.. వారిలో సృజనాత్మకతను వెలికితీస్తాయి. కాబట్టి, మీ పిల్లలు చేసిన ప్రతి మంచి పనినీ అభినందించండి. దీంతో వారు మరిన్ని మంచి పనులు చేయడానికి ఉత్సాహం చూపుతారు. ఆ ప్రయత్నంలో ఓడినా – గెలిచినా అభినందిస్తే.. వారిని మరో ప్రయాణానికి ప్రేరేపిస్తుంది.