జమ్మూకశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు.
వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది. ఆయా కారాగారాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీ శ్రీనగర్లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై భేటీ అయినట్లు సమాచారం. 2023 నుంచి జమ్మూకశ్మీర్లో జైళ్ల భద్రత ఈ దళం అధీనంలోనే ఉంది.