ఏపీ స్టేట్ బ్యూరో..
ఏపీలో కీలక మైన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఇవాళ మరో అడుగు పడింది. రాష్ట్రంలో ఆర్ధిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖలో ప్రజా రవాణా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే నగరంలో మూడు కారిడార్లుగా మెట్రో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్టు ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూర్తి కి కన్సల్టెన్సీ ల ఎంపిక కోసం ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించి వివిధ సంస్లల నుంచి అభిప్రాయాలే తీసుకుంది. మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. నేరుగా హాజరైన 14 సంస్థలు, ఆన్లైన్ లో హాజరైన 8 సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది.
టెండర్లు దాఖలుకు జూన్ 8 వరకూ గడువు ఉంది. జూన్ 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ప్రభుత్వం ఎంపిక చేయనుంది. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం ఊపందుకోనుంది. వచ్చే మూడేళ్లలో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ ఖరారు కాగానే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి తీసుకుని నిర్మాణాన్ని పరుగులు తీయించబోతోంది.
మొత్తం మూడు కారిడార్లతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ చేపట్టబోతున్నది. మొదటి దశలో మొత్తం 46.23 కిలోమీటర్లు, 42 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లుగా నిర్మిస్తారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 8 కిలోమీటర్లు నాల్గవ కారిడార్ గా నిర్మిస్తారు. దీనికి రూ.11,498 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. కేంద్రం నుంచి 100 శాతం గ్రాంట్ లభిస్తుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.