రుణయాప్‌ల ద్వారా అమాయకుల మెడకు రుణ ఉచ్చు బిగిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు గుర్తించారు. వీరికి సహకారం అందిస్తున్న 16 మందిని అరెస్టు చేసినట్లు విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గతేడాది విశాఖకు చెందిన ఓ వ్యక్తి రుణయాప్ నుంచి రూ.3,200 తీసుకుని తిరిగి చెల్లించినా సైబర్ నేరగాళ్లు వేధింపులు ఆపలేదు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుట్టు విప్పిన వాట్సప్ సమాచారం
బాధితుడి వాట్సప్‌నకు వచ్చిన బెదిరింపులను పరిశీలించగా పాకిస్థాన్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. లావాదేవీలు అస్సాం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయని నిర్ధారించారు. దీంతో పోలీసు బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపించి ఆయా బ్యాంకు ఖాతాలు తెరిచిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఇదే కేసులో కర్నూలుకు చెందిన ఆర్.శ్రీనివాసరావును అరెస్టు చేసి విచారించగా 30 బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు అందించి.. రూ.12 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించాడు.
132 ఖాతాలు సమకూర్చిన సాంబశివరావు
ఏలూరుకు చెందిన అంజనాదేవిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌కు చెందిన సాంబశివరావు(32), అతని అనుచరులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో సాంబశివరావును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనికి టెలిగ్రామ్ యాప్ ద్వారా రుణయాప్ మోసాలకు పాల్పడుతున్న చైనాకు చెందిన హంట్, ఆండీ పరిచయమయ్యారు. బ్యాంకు ఖాతాలను ఇస్తే వాటిల్లో జరిగిన నగదు లావాదేవీలను బట్టి రూ.కోటికి రూ.1.60 లక్షల కమీషన్ ఇస్తామని ఆశ చూపారు. దీంతో సాంబశివరావు తన స్నేహితులైన సందీప్, దిలీప్, జీవన్‌సాయి, సాయికృష్ణ, ఆదర్శ్, శ్రీనివాస్, భరత్ ద్వారా అమాయకుల నుంచి 132 బ్యాంకు ఖాతాలు తెరిపించారు. వాటిని చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు హంట్, ఆండీలకు ఇచ్చారు.
రూ.200 కోట్ల లావాదేవీలు
132 ఖాతాల నుంచి సుమారు రూ.200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. బ్యాంకు ఖాతాలు విక్రయించడం ద్వారా రూ.4.5 కోట్ల మేర కమీషన్ సాంబశివరావుకు వచ్చినట్లు గుర్తించారు. అతనితోపాటు దిలీప్, సందీప్ ఫోన్లను పరిశీలించగా రూ.60 లక్షల మేర క్రిప్టో కరెన్సీని గుర్తించి ఒక హార్డ్‌వేర్ సహకారంతో దాన్ని జప్తు చేశామని సీపీ తెలిపారు.